Friday, December 26, 2008

27-12-2008 surya daily
ఫిరాయింపులు, చట్టం

శాసనసభ్యులపై ఫిరాయింపుల నిరోధక నిబంధనల ప్రకారం అనర్హత వేటు పడింది. ఆరుగురు శాసనసభ్యులు ఈ నిర్ణయం నుంచి తప్పించుకొన్నారు. శాసనసభ్యులకు ఫిరాయింపు చట్టాన్ని వర్తింప చేయడం రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ జరుగనిది. ఇది చారిత్రాత్మక నిర్ణయమని కొందరు, అన్యాయమైన నిర్ణయమని మరికొందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఆలస్యంగా జరిగిన న్యాయం అన్యాయంతో సమానమని మరికొందరి వాదన. ఏమైనప్పటికీ ఈ తీర్పులో ఫిరాయింపు చట్టం మరోసారి చర్చలోకి వచ్చింది. ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఏమిటి? ఈ చట్టప్రకారం ఏ సందర్భాలలో సభ్యులు అనర్హతకి లోనవుతారు? ఈ చట్టంలో ఉన్న లొసుగులేమిటి? ఈ చట్టంలో మార్పులు తీసుకొని రావలసిన అవసరం ఉందా? ఇవీ ప్రశ్నలు.రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూలులో ఫిరాయింపు నిరోధక నిబంధనలను ఏర్పాటు చేశారు. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు తాము ఎన్నికైన పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళడాన్ని నిరోధిస్తూ చట్టం తీసుకొని రావలసిన అవసరం ఉందని 1985లో రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం భావించి, రాజ్యాంగంలో సవరణలను తీసుకువచ్చింది. చట్టం 52/85 ద్వారా ఈ నిబంధనలను రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో ఏర్పరిచారు. అప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య 401 మంది. ఈ చట్టప్రకారం ఎవరైనా సభ్యుడు తాను ఎన్నికైన పార్టీ నుంచి స్వచ్ఛందంగా వేరే పార్టీలో సభ్వత్వం తీసుకున్నప్పుడు, అదేవిధంగా తాను ఎన్నికైన పార్టీ ఆదేశాలకు భిన్నంగా, ఎలాంటి పూర్వానుమతి లేకుండా సభలో హాజరు కానప్పుడు అనర్హత వేటు పడే అవకాశం ఉంది. అదేవిధంగా పార్టీ ఆదేశాలకు భిన్నంగా సభలో తమ ఓటును వినియోగించినా కూడా అనర్హత వేటుపడే అవకాశం ఉంది. అయితే ఎన్నికైన సభ్యులలో మూడవవంతు (1/3) సభ్యులు పార్టీ నుండి విడిపోయి వేరేపార్టీలో కలిసినపుడు అది ఫిరాయింపు కిందికి రాదు. ఇలాంటి సంఘటనల ఆధారంగా ఈ చట్టప్రకారం చర్య తీసుకునే అవకాశం లేదు. ఈ మినహాయింపును పదవ షెడ్యూలు నుంచి తొలగించాలని ఎన్నికల సంస్కరణలపై నియమించిన దినేష్‌ గోస్వామి కమిటీ, రాజ్యాంగ పనితీరుపై సమీక్ష కమిషన్‌ సిఫారసు చేశాయి. చివరికి రాజ్యాంగ సవరణ చట్టం 2003 ప్రకారం దీనికి మార్పు తీసుకు వచ్చారు. ఎన్నికైన సభ్యులలో కనీసం 2/3 మంది సభ్యులు చీలి వేరే పార్టీలో కలిస్తే అది ఈ చట్టప్రకారం ఫిరాయింపు కాదు. అదేవిధంగా మొత్తం పార్టీ వేరే పార్టీలో కలిసిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు అది కూడా ఫిరాయింపు కిందికి రాదు. అదేవిధంగా ఎన్నికైన పార్టీ వేరే పార్టీతో కలవడం నచ్చక వేరుగా ఉండాలని అనుకుంటున్న సభ్యులు కూడా ఈ ఫిరాయింపు చట్టం పరిధిలోకి రారు. ఆయారామ్‌, గయారామ్‌ల సంస్కృతిని నివారించడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ సంస్కృతి మన రాషా్టన్న్రే కాదు, దేశాన్నే పట్టి పీడిస్తున్నది. ఫిరాయింపుల వల్ల ప్రభుత్వ సుస్థిరతకు ప్రమాదం ఏర్పడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి హానికరంగా పరిణమిస్తోంది. సుప్రీంకోర్టు కిహాటా „హ్లుహాన్‌ వర్సెస్‌ జాచిత్యా మరి ఇతరులు (ఏ.ఐ.ఆర్‌.1993 సుప్రీంకోర్టు 412) కేసులో ఫిరాయింపుల చట్టం గురించి ఈ విధంగా అభిప్రాయపడింది- `రాజకీయ ప్రక్రియలో రాజకీయ పార్టీల పాత్రను పదవ షెడ్యూలు గుర్తించింది. ఎన్నికల ముందు ప్రతి రాజకీయ పార్టీ ఒక నిర్దిష్టమైన ప్రోగ్రామ్‌తో వెళ్తుంది. ఆ ప్రోగ్రామ్‌కి అనుగుణంగా అభ్యర్థులను ఎన్నికలలో నిలబెడుతుంది. ఆ రాజకీయ పార్టీ కార్యక్రమాల ఆధారంగా అభ్యర్థులు ఎన్నికవుతారు. ఆ అభ్యర్థి ఎన్నికైన పార్టీని వదిలి వేరే పార్టీకి చేయూతను ఇచ్చినప్పుడు రాజకీయ ఔచిత్యత దెబ్బతింటోంది. అందుకని ఆ వ్యక్తి తన పదవిని వదలి మళ్ళీ ఎన్నిక కావలసి ఉంటుంది'.ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎవరైనా సభ్యుడు ఫిరాయింపు దారుగా పదవ షెడ్యూలు ప్రకారం నిర్ణయించే అధికారం ఆ సభాపతికి ఉంది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే సభాపతి ఆ సభ్యుణ్ణి అనర్హునిగా నిర్ధారించవచ్చు. సభాపతి కూడా ఆ సభలోని సభ్యుడే. అతడు కూడా ఒక రాజకీయ పార్టీ నుంచి ఎన్నికల్లో నిలబడి గెలిచినవాడే. అవసరమని భావించినప్పుడు మళ్ళీ ఎన్నికల్లో నిలబడతాడు. తన పదవికి రాజీనామా చేసి ఇతర పదవులను ఆయన పొందే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో వారు సభ్యులను అనర్హులుగా నిర్ణయించే ప్రక్రియలో నిష్పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉంటుందా? ఇలాంటి ప్రశ్నలను అరికట్టేందుకు 1998లో అప్పటి బెంగాల్‌ సభాపతి అధ్యక్షతన ఏర్పడిన కమిటీ `అనర్హత'ను నిర్ధారించడానికి ఎన్నికల కమిషన్‌ వలె, లా కమిషన్‌ వలె ఒక స్వతంత్ర ట్రిబ్యునల్‌గాని, కమిషన్‌గానీ ఉండాలని సూచించింది. కానీ ఈ విషయమై ఎలాంటి నిర్ణయం ఇప్పటి దాకా జరగలేదు. ఇది ఇలా ఉంటే, ఫిరాయింపుల చట్టం వల్ల ఆ సభ్యులు తమ స్వేచ్ఛను పూర్తిగా కోల్పోతున్నారని, ఏదైనా బిల్లుమీద స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెలిబుచ్చలేకపోతున్నారని కొంతమంది వాదన. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పార్టీల బలా బలాల వరకు మాత్రమే ఉంచి మిగతా విషయాల్లో స్వేచ్ఛ ఇవ్వాలని వారి వాదన. ఈ అభిప్రాయంతో పూర్తిగా ఏకీభవించలేము, అట్లా అని తిరస్కరించలేం. దీనిపై కొంత చర్చ జరగవలసిన అవసరం మాత్రం ఉంది. మనరాష్ట్రంలోని సంఘటనల నేపథ్యంలో, పదవ షెడ్యూలు ప్రకారం ఫిరాయింపుదారుడిగా ఎవరైనా సభ్యుణ్ణి నిర్ణయించడానికి ఎన్నికల సంఘం వలె, లా కమిషన్‌ వలె ఒక స్వతంత్ర సంస్థ అవసరమని అనిపిస్తుంది. ఒక్క కేసును పరిష్కరించడానికి 22 సిట్టింగులు, రెండు సంవత్సరాల కాలం పడితే- కోర్టులు కూడా ఇదే విధంగా పనిచేస్తే వాటి వద్ద విచారణలో ఉన్న కేసుల పరిష్కారానికి మరెంత కాలం పడుతుంది? అదృష్టం ఏమంటే, కోర్టులు త్వరితగతినే కేసులను పరిష్కరిస్తున్నాయి.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers