Friday, December 19, 2008

s
కస్టడీలో మరణాలు
భారత హోంశాఖ 1985 జులై 14న దేశంలోని పోలీసుల కోసం ప్రవర్తనా నియమావళిని రూపొందించింది. ఆ నియమావళిలోని మూడవ నియమం ప్రకారం `పోలీసులు తమ అధికారాలను, విధులను తప్పక గుర్తించాలి. న్యాయవ్యవస్థ విధులను అక్రమంగా స్వీకరించి (స్వీకరించినట్టు కూడా కనిపించకూడదు) తీర్పులు చెప్పడం తప్పు. అదే విధంగా తప్పుచేసిన వారిని పోలీసులు శిక్షించకూడదు'. చట్టం కూడా ఇదే విషయాన్ని చెబుతుంది. అయితే ఏదైనా నేరం జరిగినప్పుడు ప్రజల అంచనాలు, వాళ్ళు ఊహిస్తున్న విషయాలు మరోవిధంగా ఉంటాయి. ప్రజలు కోరుకుంటున్న ప్రకారం పోలీసులు ప్రవర్తించాలా, చట్టం నిర్దేశిం చిన ప్రకారం ప్రవర్తించాలా? ఇది ఇటీవల ఉత్పన్నమైన ప్రశ్న. కస్టడీలో నేరాలు జరగడం సాధారణ విషయంగా మారిపోయింది. నిజానికి అది మాములు విషయం కాదు. కస్టడీలో చిత్రహింసలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి గురించి పట్టించుకునేవారే లేకుండాపోయారు. ఈ విషయాలను గమనించి సుప్రీంకోర్టు 1996లో అత్యంత ప్రముఖమైన తీర్పును ప్రకటిం చింది. అదే డి.కె. బసు కేసు. న్యాయ నియమం ద్వారా పరిపాలన జరుగుతున్న మన సమాజంలో కస్టడీ మరణం కన్నా అతి హీనమైననేరం మరొకటి ఉండదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కుల్‌ దీప్‌ సింగ్‌, ఎ.ఎస్‌. ఆనంద్‌ అభిప్రాయపడ్డారు. చట్టం నిర్దేశించిన పద్ధతుల్లో కాకుండా వేరే రకంగా ఎవరి స్వేచ్ఛాజీవితానికి భంగం కలిగించడానికి వీల్లేదు. అందుకు రాజ్యాంగం అభయం ఇచ్చింది. రాజ్యాంగం, చట్టం అభయం ఇచ్చినప్పటికీ కస్టడీలో మరణాలు జరుగుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు డి.కె. బసు కేసులో నిర్దేశిం చిన అవశ్యకతల అమలు పటిష్ఠంగా జరుగుతోందని అనిపించడం లేదు. కస్టడీలో మరణాలే కాకుండా కస్టడీలో ఉన్నప్పుడు ఎన్‌కౌంటర్‌లు కూడా జరుగుతున్నాయి. ఇది ఒక కొత్త పరిణామం. ఒక వ్యక్తిని అరెస్టు చేయగానే అతణ్ణి సోదాచేసి అతని దగ్గరఉన్న మారణాయుధాలను పోలీసులు జప్తు చేయాలి. ఏవైనా మారణాయుధాలు ఎక్కడైనా దాచిపెడితే, ముద్దాయి వెల్లడించిన తర్వాత వాటిని పోలీసులు జప్తుచేస్తారు. ముద్దాయిలవెంట తగిన సిబ్బంది ఉంటారు. అయినా ముద్దాయిలు తిరగబడుతున్నారని పోలీసులు అంటున్నారు. ఆ సందర్భంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరెస్టయిన వ్యక్తులు మరణించడం ఇటీవల జరిగిపోతోంది. ఒక వ్యక్తిని అరెస్టు చేయడం అనేది ఆ వ్యక్తి స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. ఆకారణ అరెస్టు నుంచి రక్షణతోబాటు అరెస్టు చేసే విధానం చట్టబద్ధంగా ఉండాలి. అరెస్టు చేయాల్సిన అవసరం ఉం డాలి. నేరం జరిగిందన్న సమాచారం అందినవెంటనే చాలా కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేయాల్సిన అవసరం ఉండదు. క్రిమినల్‌ ప్రోసిజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 157 వెనుక ఉన్న ఉద్దేశం ఇదే. నేరం జరిగిందన్న సమాచారం సరైనదా, కాదా అనేది తేల్చుకున్న మీదట, నిందితుడు నేరంచేశాడని ప్రాథమికంగా నిర్ధారించుకొన్న తర్వాత, అవసరం అనుకొన్నప్పుడే అతణ్ణి అరెస్టు చేయాలి. అనుమానం మీద, కక్ష సాధింపునకు అనేక అబద్దపు ఫిర్యాదులు పోలీసు స్టేషన్‌లలో ఇస్తున్న సంగతి తెలిసినదే. అలాంటప్పు డుకూడా ఆరోపణల్లో ఆధారాలు ఉన్నాయోలేవో చూడకుండా పోలీసులు నిందితుణ్ణి అరెస్టుచేస్తున్నారు. బకాయిలు వసూలు చేసుకోవడం, పరస్పర ఒప్పందాల్లో ఏర్పడిన వివాదాల్ని పరిష్కరించుకోవడం తదితర సివిల్‌ వివాదాల్ని కూడా కొంతమంది పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళగా, వారు ఆ వివాదాల్ని దగావంటి నేరాల కిందచూపి కేసులు నమోదుచేసి బాకీ వసూలుచేసే ఏజెంట్లుగా తయారవుతున్నారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు పరచడానికి మానవహక్కులు అడ్డువస్తాయని చట్టాన్ని అమలుపరచాల్సిన అధికారులు చాలా మంది ఇవాల్టికీ భావిస్తున్నారు. అంతేకాక చట్టాన్ని అమలు పరచడంఅంటే నేరంతో యుద్ధంచేయడమేనని. ఈ యుద్ధాన్ని మానవ హక్కులపేరిట న్యాయవాదులు, ప్రభుత్వేతరసంస్థలకు చెందిన వారు ఆటంకపరుస్తున్నారనికూడా వారి అభిప్రాయం. ఈ ధోరణి ప్రమాదకరంగా పరిణమించి రహస్యంగా నిర్బంధించడం, నిందితుడ్ని ప్రశ్నించే పేరిట రికార్డుల్లో అరెస్టును చూపకుండా చాలా కాలం తమ ఆధీనంలో ఉంచుకోవడమూ, నిందితుణ్ణి భౌతికంగా హింసించడమూ వంటి చర్యలకు దారితీస్తుంది.ఇటీవల కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు తలెత్తడానికి కారణమేమిటి, వీటిని ఏ విధంగా ఎదుర్కోవలసి ఉంటుంది? డి.కె. బసు కేసులో భారత సుప్రీంకోర్టు-మీరాండా వర్సెస్‌ ఆరిజోనా కేసులో అమెరికా సుప్రీం కోర్టు ఎలా స్పందించిందో ఉదాహరించింది. `ఇంటరాగేషన్‌కి ప్రత్యేకమైన హక్కు ఇవ్వాలని, సమాజానికి అది అవసరమన్న వాదన తరచూ వస్తోంది. అది కోర్టుకి కొత్తకాదు. ప్రభుత్వ అధికారంతో మామూలు వ్యక్తి తలపడినప్పుడు ఆ వ్యక్తిని అతనికే వ్యతిరేకంగా సాక్షిగా ఉండాలని ఒత్తిడి చేయకూడదు. ఈ హక్కును తగ్గించడానికి కూడా వీల్లేదు'.రాజ్యం భద్రత గురించి వ్యక్తుల స్వేచ్ఛను బలిపెట్టడానికి వీల్లేదు. రాజ్యం భద్రత గురించి ప్రివెం టివ్‌ డిటెన్షన్‌ ఉపయోగించవచ్చు. డిటెన్యులను, దోషులను, ఆరెస్టయిన వ్యక్తులను దేశ ప్రయోజనాలకోసం ఇంటరాగేషన్‌ చేయవచ్చు. ఈ ఇంటరాగేషన్‌కు వ్యక్తిస్వేచ్ఛ కన్నా ఎక్కువ అధిక్యత ఉంది. లాటిన్‌ మాగ్జిమ్‌ షాలుస్‌ పాప్యుతి యెస్‌‌ట సుప్రీమా లెక్‌‌స (ప్రజల రక్షణ అత్యున్నతమైన శాసనం), షాలుస్‌ రిపబ్లికా మెస్‌ సుప్రియా లెక్‌‌స (రాజ్యరక్షణ అత్యున్నత శాసనం). ఇవి రెండూ ఒకదాని వెంట ఒకటి ఉండాలి. వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమం ఉంటుంది. రాజ్యం చర్యలు సరైనవిగా, న్యాయబద్ధమైనవిగా, ఉచితమైనవిగా ఉండాలి. ఎలాంటి సమాచారం రాబ ట్టడానికైనా వ్యక్తులను చిత్రహింసలపాలు చేయడం సరైనది, న్యాయబద్ధమైనది, ఉచితమైనది కాదు. ఇవి ఆర్టికల్‌ 21కి హానికలిగించేవి కాబట్టి ఆమోదయోగ్యం కావు. దోషులను శాస్త్రీయ పద్ధతు లో ఇంటరాగేషన్‌ చేయాలి. అది కూడా శాసనం ధృవీకరించిన నిబంధనలప్రకారం జరగాలి. సమాచారం రాబట్టడానికి నేరం ఒప్పుదల గురించి, సహనేరస్తుల, ఆయుధాల ఆచూకీ తెలుసుకోవడానికి వ్యక్తులను చిత్రహింసలపాలు చేయడానికి వీల్లేదు. శాసనం అనుమతించిన ప్రకారం తప్ప మరోకరంగా నేరస్తులకు రాజ్యాం గం ప్రసాదించిన హక్కులను తగ్గించడానికి వీల్లేదు. మామూలు నేరస్తులను, రకడుగట్టిన నేరస్తులను ఇంటరాగేషన్‌ చేసే పద్ధతులలో పరిమాణాత్మక బేధాలు ఉండవచ్చు. కానీ వారి హక్కులను తగ్గించడానికి వీల్లేదు. కొత్తరకమైన ఆలోచనలతో, దృక్పథాలతో టెరర్రిజం సవాలును ఎదుర్కోవాలి. టెరర్రిజంపై యుద్ధం చేయడానికి స్టేట్‌ టెరర్రిజం సమాధానం కాదు. టెరర్రిజానికి స్టేట్‌ టెరర్రిజం న్యాయబద్ధతను కలుగచేయదు.అది సమాజానికి, రాజ్యానికి, రూల్‌ ఆఫ్‌ లా కు మంచిది కాదు. అమాయక పౌరుల మానవహక్కులను టెరర్రిస్టులు ఉల్లంఘించినప్పుడు వాళ్ళు శాసనం ప్రకారం శిక్షార్హులవుతారు. కానీ వాళ్ళ మానవహక్కులను మరోరకంగా హరించడానికి వీల్లేదు. అందుకని దర్యాప్తుల్లో శాస్త్రీయ పద్ధతుల్ని వృద్ధి చేయాలి. సరైన పద్ధతుల్లో ఇంటరాగేషన్‌ చేయడానికి శిక్షణ ఇవ్వాలి. మహిళలపై నేరాలను, ఉగ్రవాదుల దాడులను ఎదుర్కోవడానికి అవసరమైనవి ముందుజాగ్రత్త చర్యలు. సరైన నిఘా వ్యవస్థ ఉంటే ఉగ్రవాద దాడులను నియంత్రించే అవకాశం ఉంటుంది. ఇది అధికారయంత్రాంగం గ్రహిస్తే సత్ఫలితాలు ఉంటాయి.
రచయిత నిజామాబాద్‌జిల్లా న్యాయసేవాధికారసంస్థ కార్యదర్శి

No comments:

Post a Comment

Followers