Tuesday, August 10, 2010

చెల్లుబాటు కాని వివాహాలు

చెల్లుబాటు కాని వివాహాలు
లా ఇలా
August 10th, 2010

చెల్లగూడని వివాహాల గురించి హిందూ వివాహ చట్టంలోని సె.12 చెబుతుంది. హిందూ వివాహ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత గానీ అంతకుముందుగానీ జరిగిన వివాహాల్లో ఈ క్రింది కారణాలు వున్నపుడు వాటిని రద్దుచేసుకోవచ్చు. అవి-
* నపుంసకత్వంవల్ల వివాహ లక్ష్యం నెరవేరకపోవడం
* మతిస్థిమితం లేకపోవడంవల్ల ఆమోదం తెలుపలేని పరిస్థితి లేదా తెలిసినా సంతానం కల్గించలేనటువంటి మానసిక అనారోగ్యం, తరుచూ మూర్చలు.
* మోసం ద్వారా సమ్మతిని పొందినపుడు
* వివాహ సమయంలో భార్య గర్భవతి అయినపుడు
దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం వుందని తేలినపుడు ఏమవుతుంది?
దంపతుల్లో ఎవరికైనా నపుంసకత్వం వుండి దానివల్ల వివాహ లక్ష్యం నెరవేరనపుడు ఆ వివాహం చెల్లగూడని వివాహంగా ప్రకటించమని కోరవచ్చు.
శారీరక సంభోగం చెయ్యలేని అశక్తత దంపతుల్లో ఎవరికైనా వుండి, అది నివారించలేని పరిస్థితి వున్నపుడు ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు. వివాహం అయిన రోజునుంచి పిటీషన్ దాఖలుచేసేవరకు ప్రతివాదికి నపుంసకత్వం వుందని వాది రుజువు చేసినపుడే కోర్టులు ఆ వివాహాన్ని రదుచేస్తాయి.
సరైన మానసిక యోగ్యత లేకపోవడం..
వివాహ స్వభావం లేదా వివాహ విధులు బాధ్యతలని అర్ధం చేసుకోలేని పరిస్థితులలో దంపతులలోని వ్యక్తులు వుంటే వారి వివాహాన్ని కోర్టులు రద్దుచేస్తాయి.
వివాహ ఒప్పందం అర్ధం చేసుకునే యోగ్యత పార్టీకి లేనపుడు వున్నా ప్రతివాదితో ఇష్టంగా నివసించినప్పుడు ఈ ఆధారం వారికి లభించదు. ఇది మానసిక అనారోగ్యం వున్న వ్యక్తులకి వర్తిస్తుంది.
సమ్మతి ఇచ్చే వయస్సుకి తక్కువ వయస్సు ఉన్నప్పుడు..
వివాహ వయస్సుకన్నా తక్కువ వయస్సులో వున్నప్పుడు వివాహం అయితే ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు. మగపిల్లలకి 21 సంవత్సరాలు, ఆడపిల్లలకి 18 సంవత్సరాలు వివాహ సమయానికి నిండి వుండాలి.
అయితే తక్కువ వయస్సు వున్న వ్యక్తులు, సమ్మతి ఇచ్చే వయస్సు వచ్చిన తరువాత కూడా ప్రతివాదితో సంసారిక జీవితం గడిపితే వివాహాన్ని రద్దుచేయమని కోరే అవకాశం వుండదు.
ఉదాహరణకి- ఒక అమ్మాయికి 17 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగి ఆ తరువాత ఆమె ఈ విషయాన్ని గుర్తించింది. అయితే ఆమె 19 సంవత్సరాల వయస్సు తరువాత కూడా సంసారిక జీవనాన్ని కొనసాగించినపుడు విడాకుల రద్దును కోరడానికి అవకాశం వుండదు. వేరే కారణాలమీద కోరే అవకాశం ఉంటుంది.
మోసం, బలప్రయోగం..
మోసం ద్వారా బలప్రయోగం ద్వారా వివాహ సమ్మతిని పొందినపుడు ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరే అవకాశం వుంటుంది. నిజం చెప్పకపోవడమే మోసం కాదు. అయితే నిజం చెప్పకపోవడమనేది కూడా కొన్ని సందర్భాలలో మోసం అయ్యే అవకాశం కేసులోని వాస్తవాలను బట్టి వుంటుంది.
బలప్రయోగం అంటే శారీరక హింస కావచ్చు లేదా ఆ బెదిరింపు కూడా కావొచ్చు. అయితే అది వివాహం జరగడానికి జరిగి వుండాలి.
అయితే బలప్రయోగం, మోసం తెలిసిన సంవత్సరం తరువాత వాది ప్రతివాదితో పూర్తి సమ్మతితో కాపురం చేస్తే కోర్టులు ఆ వివాహాన్ని రద్దుచేయవు.
వివాహ సమయంలో గర్భవతి అయినపుడు..
వివాహ సమయంలో భార్య గర్భవతిగా వుండి ఆ గర్భం భర్తతో (వాది) కాకుండా ఇతరులతో అయినపుడు భర్త ఆ వివాహాన్ని రద్దుచేయమని కోరవచ్చు.
ఈ విధంగా వివాహాన్ని రదుచేయమని కోరినపుడు ఈ క్రింది విషయాలను రుజువుచేయాల్సి వుంటుంది.
అవి-
* వివాహ సమయానికే ఆమె గర్భవతని,
* ఇతరులవల్ల ఆమె గర్భం దాల్చిందని
* వివాహ సమయంలో ఆమె గర్భవతి అన్న విషయం తనకు తెలియదని
* వివాహం జరిగిన సంవత్సరంలోగా తాను దరఖాస్తు చేశానని,
* ఇతరులతో గర్భం దాల్చిందన్న విషయం తెలిసిన తరువాత తన భార్యతో తాను సంభోగం చేయలేదని
ఇతరులవల్ల తన భార్య గర్భవతి అయ్యిందన్న సంగతి వివాహ సమయంలో తనకు తెలియదని, వివాహం జరిగిన సంవత్సరంలోపు దరఖాస్తు చేసినపుడు మాత్రమే కోర్టులు వాటిని పరిష్కరిస్తాయి. ఆ తరువాత దాఖలు చేసినపుడు వాటిని పరిశీలించవు.
ఇతరులవల్ల గర్భవతి అయ్యిందన్న సంగతి తెలిసిన తరువాత వాది తన పూర్తి సమ్మతితో తన భార్యతో సంభోగం జరుపలేదని కోర్టుకి సంతృప్తి కలిగినప్పుడే ఈ దరఖాస్తులను ఆమోదిస్తాయి.

No comments:

Post a Comment

Followers