Wednesday, June 2, 2010

శేష వీలునామా హక్కుదారంటే..?

శేష వీలునామా హక్కుదారంటే..?

June 1st, 2010

వీలునామాకర్త తన శేష ఆస్తిని ఎవరికైతే చెందాలని రాస్తాడో ఆ వ్యక్తిని శేష వీలునామా హక్కుదారంటారు. అంటే వీలునామాకర్త నిర్దేశించిన ప్రకారం వీలునామా హక్కుదారులు తమ ఆస్తులను తీసుకోగా మిగిలిన ఆస్తిని శేషాస్తి అంటారు. ఆ మిగులు ఆస్తి ఎవరికైతే చెందాలని వీలునామాకర్త నిర్దేశిస్తాడో ఆ వ్యక్తిని శేష వీలునామా హక్కుదారంటారు.
వీలునామా ఆస్తి
వీలునామా కర్తకన్నా ముందు వీలునామా హక్కుదారు చనిపోయినప్పుడు, ఆ వీలునామా ఆస్తి వీలునామా కర్త చట్టబద్ధ వారసులకే చెందుతుంది (105 (1) భారతీయ వారసత్వ చట్టం). అలాగే వీలునామా కర్త తరువాత వీలునామా హక్కుదారు చనిపోతే ఆ వీలునామా ఆస్తి వీలునామా హక్కుదారు చట్టబద్ధ వారసులకి చెందుతుంది (105 (2) భారతీయ వారసత్వ చట్టం).
ఇద్దరూ ఒకేసారి చనిపోయినప్పుడు
వీలునామా కర్త దాని హక్కుదారు ఇద్దరూ ఒకేసారి విమాన ప్రమాదంలోగానీ ఇతర ఏ ప్రమాదంలోనైనా చనిపోయినప్పుడు ఎవరు ముందు చనిపోయారోనన్న సాక్ష్యం లేనప్పుడు ఆ ఆస్తి వీలునామా కర్త చట్టబద్ధ వారసులకే చెందుతుంది. అయితే హిందువులకు సంబంధించినపుడు ఆ ఇద్దరిలో ఎవరు చిన్నవారో అతని వారసులకి ఆ ఆస్తి చెందుతుంది.
ఇద్దరికీ ఇచ్చినప్పుడు
వీలునామా ఆస్తిని ఇద్దరు వ్యక్తులకు సమష్టిగా చెందాలని రాసినపుడు ఆ ఇద్దరిలో ఎవరైనా వ్యక్తి వీలునామా కర్త కన్నా ముందే చనిపోతే, ఆ ఆస్తి మిగతా వ్యక్తికి చెందుతుంది.
పిల్లలకు ఇచ్చినప్పుడు
రామయ్య తన కొడుకు గంగాధర్‌కి తన డబ్బు మొత్తం అతని ఉపయోగార్థం చెందాలని వీలునామా రాసాడు. అయితే గంగాధర్ తన కొడుకు రవీందర్ పుట్టిన తరువాత రామయ్యకన్నా ముందే చనిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వీలునామా ఆస్తి గంగాధర్ కొడుకు రవీందర్‌కే చెందుతుంది. ఒకవేళ గంగాధర్ కూడా వీలునామా రాసి తన ఆస్తి మొత్తం తన భార్య విమలకి చెందాలని రాసినపుడు ఆస్తి కొడుకు రవీందర్‌కి కాకుండా గంగాధర్ భార్య విమలకి చెందుతుంది.
పిల్లలంటే
ఒక వ్యక్తి సంతతిని పిల్లలుగా భావిస్తారు. అంటే అతని మనుమలు, మనుమరాళ్లు అతని పిల్లలుగా భావించరు. అక్రమ సంతతిని కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అతని సంతతిగా పరిగణిస్తారు. గర్భంలో వున్న పిల్లల్ని కూడా అతని సంతతిగా పరిగణిస్తారు. (సె.99 (జి), 99 (ఎ) భారతీయ వారసత్వ చట్టం.
వీలునామా డిపాజిట్ చేయవచ్చా
వీలునామాలని రిజిస్ట్రేషన్ చట్టప్రకారం డిపాజిట్ కూడా చేయవచ్చు. వీలునామాకర్త తాను స్వయంగా కానీ, తన ఏజెంట్ ద్వారా కానీ వీలునామాని కవర్‌లోపెట్టి దాన్ని సీల్ చేసి రిజిస్ట్రార్ (సబ్ రిజిస్ట్రార్) దగ్గర డిపాజిట్ చేయొచ్చు. కవరుమీద వీలునామా కర్త పేరు, అది దేని గురించో, ఆ స్టేట్‌మెంట్ దాని కర్త సంతకంతో వుండాలి. అది వీలునామా కర్తదేనన్న విషయం సంతృప్తి చెందిన తరువాత, దాని కవర్‌పైనున్న విషయాలు తన రిజిష్టర్‌లో నోట్ చేసి ఆ కవరును డిపాజిట్ చేసుకుంటారు. ఇలా డిపాజిట్ చేసిన వీలునామాలను రిజిస్ట్రేషన్ అధికారులు తెరువరు. దాన్ని అలాగే భద్రపరుస్తారు. వీలునామా డిపాజిట్ చేయడానికి, దాన్ని రిజిష్టర్ చేయడానికి భేదముంది. రిజిష్టర్ చేసిన వీలునామాలోని విషయాలను తమ రిజిష్టర్‌లో నోట్ చేసుకొని వీలునామాపై సీల్ వేసి తిరిగి వీలునామా కర్తకు ఇచ్చేస్తారు.
డిపాజిట్ చేసిన వీలునామా కర్త
మరణించినప్పుడు
వీలునామా డిపాజిట్ చేసిన వ్యక్తి మరణించినప్పుడు, అతని మరణ ధృవీకరణ పత్రాన్ని రిజిస్ట్రార్‌కి అందచేసినప్పుడు అతని సమక్షంలో ఆ వీలునామాలోని విషయాలను తాను రిజిష్టర్‌లో రాసి దాన్ని తమ వద్ద భద్రపరుస్తారు. ఆ వీలునామాని ధృవీకరించడానికి కోర్టులో దాఖలు చేయమని కోర్టు ఆదేశించినప్పుడు కోర్టులో దాఖలు చేస్తారు.
రిజిస్ట్రేషన్ తప్పనిసరా..?
వీలునామా తప్పనిసరిగా రిజిష్టర్ చేయించాల్సిన అవసరం లేదు. కాని రిజిష్టర్ చేయించడం మంచిది. అనవసరపు చిక్కులు వుండవు. *

No comments:

Post a Comment

Followers