Tuesday, August 4, 2009

గౌరవ హత్యలు


నేరాలు పాతవే. కానీ పేర్లు మారుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొన్ని పదబంధాలు వచ్చాయి. అవే -ద్వేషించే నేరాలు, ద్వేషించే ఉపన్యాసం, గౌరవనేరాలు, గౌరవహత్యలు. ఇలాంటి నేరాలకు సంబంధించి కొత్త చట్టం కావాలని కఠిన శిక్షలు ఉండాలని మరి కొందరు వాదిస్తున్నారు. కొత్త చట్టాలు అవసరం లేదు. ఈ నేరాలని త్వరితగతిన దర్యాప్తు చేయడానికి దర్యాప్తు సంస్థలు, పరిష్కరించడానికి ప్రత్యేక కోర్టులు ఉంటే చాలని మరి కొంత వాదిస్తున్నారు. ‘గౌరవ నేరాలు’ ‘గౌరవ హత్యలు’ దేశమంతటా జరుగుతూనే ఉన్నాయి. కానీ హర్యానా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా జరుగుతున్నాయి.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి చిదంబరం రాజ్య సభలో ప్రస్తావించారు. ఈ గౌరవ నేరాలని, గౌరవ హత్యలని అరికట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉందని మంత్రి చెప్పారు. ఈ పదబందాలని వింటున్నప్పుడు చాలా మందికి ఆశ్చర్యం కలుగుతుంది. నేరాల్లో గౌరవ నేరాలు, హత్యల్లో గౌరవ హత్యలు కూడా ఉంటాయా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతాయి. ‘గౌరవనేరాలు’ ‘గౌరవహత్యలు’ అంటే ఏమిటో, వీటిని అరికట్టడం ఎవరి బాధ్యత, వీటిని అరికట్టడానికి ప్రత్యేక చట్టం అవసరమా? అమల్లో ఉన్న చట్టాల్లో మార్పులని తీసుకొస్తే సరిపోతుందా? ఈ ప్రశ్నలకి సమాధానాలని వెతుకుందాం.

ఇటీవలి కాలంలో జరిగిన రెండు మూడు సంఘటనలని హోంమంత్రి ఉదహరించారు. వాటిని చూద్దాం. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని మీరట్‌లో ఓ ముస్లిం యువతిని దళిత యువకుడు, పెద్దవాళ్ళకి చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. ఆ తరువాత ఆ యువకుడు హత్యకు గురైనాడు. ఇలాంటి మరో సంఘటన హర్యానాలో జరిగింది. ఓ జంట పెద్దలకు తెలియకుండా కులాంతర వివాహం చేసుకున్నారు. ఆ తరువాత ఆ అమ్మాయి బంధువులు ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకొని పోయినారు. ఈ విషయం తెలుసుకున్న భర్త కోర్టులో దరఖాస్తు చేసి, కోర్టు ఉత్తర్వుల మేరకు కోర్టు జవానుని తీసుకొని భార్యని వెదకడానికి బయల్దేరాడు. చివరికి ఆ ఇద్దరూ ఆ అమ్మాయి కుటుంబ సభ్యుల చేతుల్లో హతమయ్యారు. ఇవి రెండూ ఈ మధ్య కాలంలో జరిగిన సంఘనలు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి.

కొన్ని సందర్భాల్లో ఈ విధంగా వివాహాలు చేసుకున్న వ్యక్తులని సాంఘిక బహిష్కరణకు కూడా గురి చేస్తుంటారు. రకరకాలైన ఆంక్షలని కూడా విధిస్తూంటారు. కుల సంఘాలు, మత పెద్దలు తీర్పులని, ఫత్వాలని కూడా వీరికి వ్యతిరేకంగా జారీ చేస్తుంటారు. ఇటువంటి నేరాలనే గౌరవ నేరాలని, ఇలా జరిగే హత్యలనే గౌరవ హత్యలని అంటున్నారు. కుటుంబ గౌరవాలని మంట కలిపారని వారి బంధువులు చేసే నేరాలు ఇవి. కాల దోషం పట్టిన ఆచారాల్లో వీటి వేళ్ళు పాతుకుపోయి ఉన్నాయి. ఈ నేరాలు ఎక్కువగా ఇలాంటి వివాహాలు చేసుకున్న యువతీ కుటుంబ సభ్యుల పైన ఎక్కువగా జరుగుతుంటాయి మన భారత దేశ చట్టాల్లో వీటిని ప్రత్యేకంగా వర్గీకరించరాదు. ఇలాంటి సంఘటనల్లో ఎవరైనా హత్యకు గురైతే, ముద్దాయిలపై భారతీయ శిక్షాస్మృతిలోని సె.302 ప్రకారమే కేసులు నమోదవుతున్నాయి.

ఒక వ్యక్తిని ప్రేమించడం, పెళ్ళి చేసుకొని జీవించడం ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కల్పించిన హక్కు అయితే వాళ్ళిద్దరూ మేజర్లై ఉండాలి. చట్ట ప్రకారం వివాహాం చేసుకునే యోగ్యత కలిగి ఉండాలి. కుటుంబ గౌరవం పేరుతో జరిగే ప్రతి మరణం పురాతన భావాలకు నిదర్శనం. నేటి ఆధునిక ప్రజాస్వామ్య యుగంలో ఈ మరణాలు దిగ్భ్రాంతిని కలుగచేస్తాయి. కఠినమైన కుల సమాజంలో కుటుంబ గౌరవం పేరుతో జరుగుతున్న హత్యలే ఈ గౌరవ హత్యలు. గ్రామాల్లో కుల సంఘాలు తీర్పులని అమలు చేస్తూ కొంత మంది వ్యక్తులు ఈ నేరాలకి పాల్పడుతున్నారు. ఈ నేరాలు స్త్రీల పైనా, పురుషులపైనా, జరుగుతున్నాయి. ప్రేమి అప్యాయతలకి ఈ నేరాలు వ్యతిరేకం, కుల సంఘాలు జారీ చేసే తీర్పులకి, ఫత్వాలకి చట్టం దృష్టిలో ఎలాంటి విలువ లేనప్పటికీ ఆ తీర్పులు కొన్ని రాష్ట్రాలో కోర్టు తీర్పులు డిక్రీల కన్నా సమర్ధవంతంగా అమలవుతున్నాయి. ఇది చాలా అందోళన కలిగిస్తున్న అంశం.

కులసంఘాలు తీర్పులు చెప్పకుండా ఫత్వాలు జారీ చేయకుండా అదుపు చేయడానికి తగిన నిబంధనలు ఇప్పుడు అమల్లో ఉంటున్న చట్టాల్లో లేవు. అదే విధంగా సంఘ బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేస్తే వారిపై సరైన చర్యలు తీసుకునే విధంగా భారతీయ శిక్షాస్మృతిలో ఎలాంటి నిబంధనలు లేవు. అందుకని తగు నిబంధనలు తేవడం అవసరమే. సాధారణంగా నేరాలని రుజువు చేసే బాధ్యత ప్రాసిక్యూషన్‌ పై ఉంటుంది. వరకట్నం చావు విషయంలో కూడా అలాంటి నిబంధనలే ఉన్నప్పటికీ, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో ఆ నేరం గురించి నిజమనే భావనని తీసుకోవడానికి సె113బి అన్న నిబంధనని ఏర్పరిచారు.

ఈ హత్యల విషయంలో కూడా అలాంటి నిబంధన అవసరమని అన్పిస్తుంది. కలాంతర, మతాంతర వివాహాలని ఎవరైనా జంట వివాహం చేసుకొని దాన్ని వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకించినప్పుడు ఒకటి రెండు సంవత్సరాల్లో వారి మరణం అసాధారణ పరిస్థితుల్లో జరిగితే దానికి ఆ కుటుంబ సభ్యుల బాధ్యత వహించే విధంగా భారతీయ సాక్ష్యాధారాలు చట్టం మార్పులు అవసరమే. ప్రత్యేక చట్టం చేయన్పటికీ భారతీయ శిక్షాస్మృతిలో, భారతీయ సాక్ష్యాధారాల చట్టంలో అవసరమైన సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్పిస్తుంది. పోలీసులు, శాంతి భద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశాలుగా రాజ్యాంగం రాష్ట్రాలకు అప్పగించిన్పటికీ, ఈ విషయంలో అవసరమైన సవరణలని, అవసరమనిపిస్తే కొత్త చట్టాన్ని తీసుకురావల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. చట్టంలో మార్పులే కాదు పరిష్కారానికి అవసరమైన న్యాయ, పోలీసు యాంత్రాంగాన్ని కూడా ప్రత్యేకం ఏర్పాటు చేయాలి. అలా చేయనప్పుడు తగు ఫలితాలు వచ్చే అవకాశం లేదు.

No comments:

Post a Comment

Followers